Tuesday, 23 August 2011

నే చూసిన దయ్యం..

" రోజు నాతో పాటు రావల్సిన నా స్నేహితులు రాకపోవటంతో రోజు రాత్రి నేను ఒక్కడినే ఒంటరి గా ట్యూషన్ నుండి ఇంటికి రావల్సి వచ్చింది. కాని అంతలో వారం రోజుల కిందటే చనిపోయిన వ్యక్తీ తెల్ల బట్టలతో నాకు ఎదురుగా వచ్చి నన్ను పలుకరిస్తే ..."
               అప్పుడు నేను 9 తరగతి చదువుతున్నా, మా క్వాటర్స్ కు పక్కనే ఉన్నపూల తోట అనే గ్రామం లో మధూ సార్ వద్ద మాథ్స్ మరియు సైన్సు ట్యూషన్ కు వెళ్ళే వాళ్ళం. ప్రతీ రోజు ఐదు గంటలకు స్కూల్ నుండి ఇంటికి  వచ్చి అమ్మ చేసినదేదో ఇంత తిని 6.30 గం. వెళ్ళే వాడిని. రాత్రి 8.30 గం. ట్యూషన్ అయ్యిపోయిన తరువాత నేను, గోపాలు, హుస్సేను కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం. మల్లె పూల రంగన్నఅనే ఒకతను ప్రతీ రోజు రాత్రి మేము వచ్చేటప్పుడు ఎదురుగా దార్లో కలిసి "బాగా చదువుకోండమ్మ" అంటూ మమల్నీ పలుకరిoచే వాడు. మల్లె పూల రంగన్న బాలకృష్ణ కు ఎంతటి వీరాభిమాని అంటే , అప్పట్లో హిట్ అయ్యిన "సమర సింహా రెడ్డి" సినిమాలోని బాలయ్య లాగ షర్టు, పంచె చెప్పులు అన్ని తెల్లవే వేసేవాడు. కాని కొన్ని రోజుల తరువాత పాపం మల్లె పూల రంగన్న ఎక్కడో ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయాడని తెలిసిందిప్రతీ రోజు మాకు దార్లో కలిసి పలుకరించే రంగాన్న చనిపోయాడంటే కాస్త బాధ కూడా వేసింది.
     
             వారం రోజుల తరువాత గోపాల్, హుస్సేన్ వాళ్ళ స్కూల్లో ఏదో ఫంక్షన్ వుందని వాళ్ళు ట్యూషన్ కు రాలేదు, వాళ్ళు రాక పోవటం తో నేను ఒక్కడినే ఉన్నానంటూ మా మధు సారూ కూడా నన్ను రోజు 8 గం. లకే వదిలేసాడు. ఆ ఐదు కిలోమీటర్లు  ఒంటరిగా ఏదో పాటలు పాడుకుంటూ ఇంటికి వస్తుంటే, దూరం నుండి ఎదురుగా అవే తెల్ల బట్టలు వేసుకొని వారం రోజుల క్రితం ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయిన  మల్లె పూల రంగన్న నాకెదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. అంతే నా  పై ప్రాణాలు పైనే పోయాయిచుట్టూ చూసా ఎవరూ లేరు, అప్పటి వరకు దయ్యం అంటే ఎన్నో విన్న నేను మొదటి సారిగా ఎవరూ లేని సమయం లో ఒంటరి గా దయ్యం నాకు ఎదురుగా రావటం చూసా. వెన్నక్కు పారిపోదామా అంటే దాదాపు సగం వచ్చేశా మరి పోలేని పరిస్థితి , దయ్యం నాకు దగ్గరగా వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది.. దగ్గరకు రానే వచ్చేసింది.. "ఏంటి రోజు నీ దోస్తులు రాలేనట్టుర్నారే, జాగర్తగా ఇంటికి వెళ్ళు" అంటూ ఏదో వార్నింగ్  ఇచ్చినట్టుగా మాట్లాడి నన్ను దాటుకొని వెళ్లిపోయింది . నన్ను ఏమి చేయనందుకు ఆనందపడాలో, లేక దయ్యం నాతో మాట్లిందని భయపడాలో కూడా ఆలోచించే పరిస్థితి నేను లేక ఎలా పరిగెత్తానో , ఎలా ఇంటికి వచ్చానో తెలియదు, అంతే నూట్రెండు జ్వరం తో  రెండు రోజులు స్కూలు ట్యూషన్ రెండూ బంద్.

         మూడో రోజున కాస్త తేరుకున్నాక ట్యూషన్ కు వెళ్ళా. ట్యూషన్ అయినతరువాత గోపాలు, హుస్సేను ఇద్దరూ తోడు ఉన్న కూడా మల్లి ఎక్కడ దయ్యం వస్తుందో అని ఎక్కడో చిన్న భయం తో వస్తూ, గోపాల్  గాడికి అసలు విషయం చెప్పా, వాడు షాక్ కాని అంతలో గట్టిగా నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. " ఆ రోజు ట్రాక్టర్ బోల్తా పడి చని పోయింది నేను అనుకునే  ఈ మల్లె పూల రంగన్న కాదని, వేరే మల్లె పూలు అమ్ముకునే వేరే ఇంకో రంగన్న అని ". 

నాకు నవ్వాలో , ఏడవాలో అర్థం కాని పరిస్థితి, నాకు మాత్రం  మూడు రోజులు నేను అప్పుడే చనిపోయి ఫ్రస్షు గా దయ్యం ఆయినా వాడిని చూసినట్టే కదా.

No comments:

Post a Comment